Hussain call
#HusaainCall
కొంచెం ఆలస్యంగా!!
మొన్న పెళ్లి కూతురు కోసం మనం చేసిన సహాయం చూసి గురువారం ఒక హుస్సేన్ నాకు కాల్ చేశాడు.తనది కర్నూల్ అని, తాము ఐదుగురు అన్నదమ్ములం అని, బంగారం వ్యాపారం చేస్తామని,తమ తల్లి గారు చెప్పడం వల్ల ప్రతి సంవత్సరం ఐదుగురికి ధనసహాయం చేస్తానని చెప్పుకొచ్చాడు.తెలుగు స్పష్టంగా మాట్లాడుతున్నాడు.నా నెంబర్ ఎవరిచ్చారు అడగడంతో ఇక్కడే మెహదీపట్నంలో ఉండే ఇమామ్ ఇచ్చాడు అని చెప్పాడు.
మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా ముస్లింలు కానీ, స్త్రీలు కానీ, వికలాంగులు కానీ ఆర్ధిక సహాయం కోసం చూస్తుంటే నాకు చెప్పండి అన్నాడు.స్వతహాగా నేను వీళ్ళకి దూరంగా ఉంటానని నా సంగతి తెలిసిన వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.వెంటనే నేను ఓన్లీ ముస్లింలకు మాత్రమే సహాయం చేస్తారా అనడగడంతో అటు నుంచి "లేదు.. లేదు సహాయం చేస్తానికి అలా చూడకూడదు మేడం. ఎవరికైనా చేస్తాము" అన్నాడు. నాకు ఎవరూ తెలియదు, మీరు సహాయం చేస్తారని కూడా తెలియదు.ఎవరైనా ఉంటే చెప్తాలెండి అన్నాను. అతను కొంచెం ఆత్రం గొంతుతో "వెంటనే చెప్పండి మేడం, సాయంత్రానికి చెప్పేయండి.. నేను ఐదుగురిని చూసుకోవాలి సహాయం చేయడానికి" అన్నాడు. సాయంత్రం వరకు ఏంటి అనేది నా ప్రశ్న!!రేపు శుక్రవారం, సహాయం చేశాకే నమాజ్ కి వెళ్తాను అన్నాడు.
నాకు అస్సలు నమ్మబుద్ధి కాలేదు కానీ మనం కిందటి సారి సహాయం చేసిన నలుగురైదుగురు పిల్లల అవసరం గుర్తొచ్చింది. నాకు నలుగురు పిల్లలకు ఫీజు అవసరం ఉందని తెలుసు.వాళ్ళ స్కూల్ బ్యాంకు నెంబర్ ఇస్తాను నేరుగా వాళ్ళకే వేయండి అని చెప్పా!!
ఇప్పుడు కథ మొదలు....
"మా అమ్మ గారి చేతుల మీదుగా ఇస్తాను.ఓన్లీ క్యాష్ మాత్రమే అది కూడా రేపు పొద్దున్నే ఆరింటికి హైదరాబాద్లో బయలుదేరితే తొమ్మిది, పది గంటలకు వచ్చేస్తారు.వాళ్ళకి మా అమ్మ చేత డబ్బులు ఇప్పించి బస్ ఎక్కిస్తాను" అన్నాడు. వాళ్ళలో సింగిల్ పేరెంట్ కూడా ఉన్నారు, హైదరాబాద్ లో లేని వాళ్ళు కూడా ఉన్నారు. అలా ఉన్నపళంగా రాలేరు అని చెప్పా. ఎంత ఫీజులు ఉంటాయి మేడం అన్నాడు. దగ్గర దగ్గర ఒక్కొక్కరికి ముఫ్ఫై నుంచి నలభై వేల వరకు ఉంటాయి అని చెప్పడంతో "అంతేనా.. మేము ఇచ్చేస్తాం మేడం, వాళ్ళ అమ్మకి కూడా డబ్బు ఇచ్చి ఇంటి నుంచే చీరలో,గాజులో అమ్మేలాగా ఏర్పాటు చేస్తాం మేడం.లేదంటే టిఫిన్ సెంటర్, కూరగాయలు ఇలా ఏ వ్యాపారం అయినా డబ్బు ఇస్తాం మేడం.మాకు ఇంకా ముగ్గురు కావాలి.మా అమ్మ చేతుల మీదుగా సహాయం చేయాలని మా కోరిక మేడం" అని చెప్పాడు.
ఒకరు హైదరాబాద్ నుంచి రాగలరు, ఇంకొకరు బందరు నుంచి రావాలంటే కష్టం కాబట్టి నేనే వస్తాను వీళ్ళని తీసుకుని అని చెప్పాక గందరగోళం ఏదో మీద పడ్డట్టు "మీరు వద్దు మేడం, వాళ్ళని పంపండి చాలు, మీరు రావద్దు" అన్నాడు. ఇక్కడ అనుమానం రెండింతలు అయ్యి "సరే నీ నెంబర్ వాళ్ళకి ఇస్తాను.వాళ్ళు కాల్ చేస్తారు" అని చెప్పి ఫోన్ కట్ చేసేశాను. ఇహ ఆ సంగతి కూడా మర్చిపోయి మా అక్క, చెల్లి వాళ్ళు రావడంతో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయా.
సరిగ్గా సాయంత్రం అవగానే మళ్ళీ ఫోన్ మేడం నాకు ఐదుగురు కావాలి, మీరు ఏ విషయం చెప్పలేదు అని. బాగా ఆలోచించి అవసరం ఉన్న వాళ్ళకి, నాకు కావాల్సిన వాళ్ళకి కూడా అసలు విషయం తెలుసుకోవడానికి ఇతని నెంబర్ ఇచ్చాను.వాళ్ళ ఆధార్ ఫోటోలు,వాళ్ళ ప్రస్తుత ఫోటోలు తీసుకున్నాడు. వాళ్ళ ఇంట్లో ఇంకా ఎవరైనా ఆడవాళ్ళు ఉంటే.... కేవలం ఆడవాళ్ళు ఉంటే ధన సహాయం చేస్తాను బిజినెస్ కోసం తీసుకురావాలి అని చెప్పాడు. ఒకరికి వాళ్ళ అన్నయ్య వస్తానంటే వద్దు.. వద్దు డబ్బు విషయంలో ఎవరినీ నమ్మకూడదు మీరు,మీ అమ్మ రావాలని చెప్పాడు. మరొకరికి భర్త ఉంటే సహాయం చేయము, ఒంటరి మహిళలకు మాత్రమే చేస్తాము.కావాలంటే మీకు తెలిసిన ఆడవాళ్ళని మాత్రమే తీసుకురండి.ధన సహాయంతో పాటు కొత్త మొబైల్ ఫోన్ ఇస్తాము.ఆరు నెలల పాటు మీ వ్యాపారం ఫోటోలు తీసి పంపుతూ ఉండాలి.ఇవి కాకుండా నెలకు వెయ్యి రూపాయలు కూరగాయలు, మాంసం కోసం ఇస్తాం. మొబైల్ కోసం నాలుగు వేలు కట్టండి.మిగిలిన ఎమౌంట్ నేను కడతాను.కానీ మీరు ఒక్కొక్కరు నాలుగు వేలు డౌన్ పేమెంట్ ఇవ్వాలి.ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ ఫోన్ ఇస్తాము" అని చెప్పాడు. మన వాళ్ళు ఒక్కొక్కరు నాకు కాల్ చేసి విషయం అంతా చెప్పారు.అప్పటికే వీళ్ళు ఫోటోలు, ఆధార్ కార్డు పంపేశారు. నేను కొంచెం మందలింపుగానే అలా ఎలా పంపుతారని అడిగా కానీ వాళ్ళ నిస్సాహయత అది.
వెంటనే నేను ఫోన్ చేసి "మా వాళ్ళని ఆధార్, ఫోటోలు అడిగావు కదా..నీ ఆధార్,నీ అడ్రస్ పెట్టు.. వాళ్ళని రేపు బస్ ఎక్కిస్తాను,మా వాళ్ళు కర్నూలు లో ఉన్నారు.వాళ్ళు వీళ్ళని రిసీవ్ చేసుకుని మీ అడ్రస్ కి తీసుకొస్తారు" అని చెప్పాను. సరే..సరే మేడం ఇప్పుడే పెడతాను అన్న మనిషి చాలా సేపటి తరువాత కాల్ చేసి "మీ వాళ్ళు అన్నారు కదా మేడం.ఎవరూ వద్దు, మాకు ప్రచారం ఇష్టం లేదు" అన్నాడు. "నీకు ప్రచారం నేనెందుకు చేస్తాను, ఆడవాళ్ళు మాత్రమే రావాలని చెప్పావు కదా మా వాళ్ళకి, సెక్యూరిటీ లేకుండా అలా ఎలా పంపుతారని అనుకున్నావు" అని మన ఒరిజినల్ టోన్ తో మాట్లాడా..
వాడు తడబడుతూ "నేను వెళ్ళి బస్టాండ్ లో దింపుకుంటాను మేడం.మాది ఒక పెద్ద బండి ఉంది.దిగగానే ఫోన్ చేస్తే నేనే వెళ్తాను" అన్నాడు. "నిన్ను అయినా ఎలా నమ్ముతారని అనుకుంటున్నావు? నా మాట నమ్మి వస్తారు కానీ నిన్ను నమ్మి కాదు.. ముందు నీ ఆధార్, అడ్రస్ పెట్టు అప్పుడు వీళ్ళు బస్ ఎక్కుతారు" అని గట్టిగా చెప్పా.. వెంటనే "నాకు నమాజు టైం అయ్యింది మేడం, అవగానే కాల్ చేస్తాను" అని పెట్టేశాడు..
రాత్రి పది గంటలకి మళ్ళీ గుర్తొచ్చామో ఏమో.. ఫోన్ చేసి "మాట్లాడొచ్చా మేడం.. సారీ ఈ టైం కి ఫోన్ చేశాను" అన్నాడు. "ఫర్వాలేదు చెప్పండి" అనడంతో "మా నాన్న ఇక్కడ ఉండే వాళ్ళకి చెప్తానని మీరు ఎందుకు అన్నారని, కావాలంటే వాళ్ళని వచ్చి కామ్ గా పైసలు తీసుకుని పొమ్మని చెప్పారు మేడం" అన్నాడు.
"మీకేం బాధ? సరే మా వాళ్ళు రారు.. పోనీ నీ అడ్రస్, ఆధార్ ఏవి" అనడిగా.."అవి ఎందుకు మేడం? మీరు పంపండి.. నేను దింపుకుని తీసుకెళ్ళి, మళ్ళీ బస్ ఎక్కిస్తాను" అన్నాడు. ఇహ లాభం లేదని "నీకు సహాయం చేయాలని ఉంది అన్నావు.. ఐదుగురు కావాలి అన్నావు. ఇప్పుడు ఏమో ఇలా అంటున్నావు.పోనీ మా వాళ్ళకి మీ అమ్మ చేత జీపే, బ్యాంకు ట్రాన్స్ఫర్ చేయించేయ్ నిజంగా నువ్వు సహాయం చేయాలని అనుకుంటే" అని ఘాటైన స్వరంతో చెప్పా!!
"మేడం అలా ట్రాన్స్ఫర్ చేయలేము. డబ్బు మాత్రమే ఇస్తాము.మా సంస్ధలు ఉంటాయి (PSi, phi అంటూ ఏవేవో సంస్థల పేర్లు చెప్పాడు) వాళ్ళ ద్వారా డబ్బు మాత్రమే ఇవ్వగలం.బ్యాంకు ట్రాన్స్ఫర్ అంటే ప్రాబ్లం వస్తుంది మాకు,మా సంస్థలకు" అన్నాడు...
"ఐదుగురు అన్నదమ్ములం అన్నావు, బంగారం షాపులు అన్నావు, అమ్మ చేతి మీద సహాయం అన్నావు. ఇప్పుడు ఏంటి సంస్థలు అంటున్నావు?? ఏదొకసారి సరిగ్గా నీ సంస్థల పేర్లు చెప్పు " అన్నాను..
అప్పటి దాకా స్పష్టంగా మాట్లాడిన హుస్సేన్ నోరు తిరిగినట్టు అక్షరాలు మార్చి మార్చి చెబుతున్నాడు..
"సరే.. నీకు సహాయం చేయాలని ఉంటే వాళ్ళకి బ్యాంకు ద్వారా మాత్రమే చెయ్యి.. చేయకపోయినా ఫర్వాలేదు.ముందు నీ ఆధార్ అడ్రస్ పెట్టు.మా వాళ్ళ ఫోటోలు, ఆధార్ అడిగే అవసరం ఏంటి? ఓన్లీ క్యాష్ అంటే ఏంటి? పైగా స్మార్ట్ ఫోన్లు ఇస్తానని చెప్పావు? అడగకుండానే ఇంట్లో ఆడోళ్ళకి, తెలిసిన ఆడవాళ్ళకి ధన సహాయం చేస్తాను అని ఎందుకు అంటున్నావు" అని అడిగా.. కానీ నోరు విప్పకుండా "అదీ మేడం" అని నీళ్ళు నమిలి ఫోన్ కట్ చేశాడు...
దీన్ని ఏ విధంగా చూడాలి???
భయం వేసింది కానీ నోరు ఉంది కాబట్టి సరిపోయింది అనిపించింది... కానీ ఈ సంగతి అంతా ఎవరికి కంప్లైంట్ చేయాలో వారికి సాక్ష్యాలతో సహా చేశాను..
చూద్దాం!!
Comments
Post a Comment